Monday 13 February 2012

పాప్ సంగీతానికి రారాజు - మైకెల్ జాక్సన్

పాప్ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరిన తొలి నల్లజాతి గాయకుడు మైకెల్ జాక్సన్. దుర్భర దారిద్య్రం నుంచి, కుటుంబ హింస నుండి స్వయంకృషితో గొప్ప కళాకారుడు మైకెల్ జాక్సన్. అతని హఠాన్మరణం సంగీత ప్రియులని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగురుతునే, నెత్తురు కక్కుకుంటూ నేల రాలేందుకు సిద్ధమైన మైకెల్ జాక్సన్ అంతరంగమధనం గురించి తెలుసుకుంటే భావి తరాల కళాకారులకు మంచి పాఠాలు అందుతాయనే ఉద్దేశంతో మైకెల్ జాక్సన్ జీవితగాథని తెలుగు పాఠకులకి అందించింది పాలపిట్ట బుక్స్.

సాధారణంగా ప్రజలు కళాకారులని చూస్తారు, కళని చూసి ఆనందపడతారు. కాని ఆ కళాకారుడు కూడ తమలాంటి మనిషేనని, కళని మినహాయిస్తే, అతనిలోను మాములు మనిషిలాగే భయాలు, ఆందోళనలు, ఉద్విగ్నతలు, ఉద్వేగాలు, అసూయాద్వేషాలు, బలహీనతలు ఉంటాయని ప్రజలు గ్రహించరు. కళాకారుడి వెనుక దాగిన అసలు మనిషిని చూడరు. కళాకారుడిలోని అసలు మనిషి బయటకి రాగానే, విస్తుపోతారు. ఆ మనిషిలోని బలహీనతల ఆధారంగా కళాకారుడిని కొత్తగా అంచనా వేస్తారు. కొన్ని సార్లు చిన్నబుచ్చుతారు. కళాకారుడిగా అందరు గుర్తించి ఆదరించిన మైకెల్ జాక్సన్‌ను ఓ వ్యక్తిగా కూడా గౌరవించాలని చెప్పడానికి ఈ పుస్తకం ద్వారా రచయిత కస్తూరి మురళీకృష్ణ ప్రయత్నించారు.

మైకెల్ జాక్సన్ బాల్యం నుంచి పాప్ సంగీత రారాజుగా ఎదిగిన వైనాన్ని ఈ పుస్తకంలో చక్కగా వివరించారు రచయిత. నిజమైన మైకెల్ జాక్సన్ ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ప్రతీ వ్యాసంలోను పరిచయక్రమంలో రాసిన వాక్యాలు మైకెల్ జాక్సన్‌ని కొత్త కోణంలో చూపుతాయి, అప్పటి దాక అతనిపై ఉన్న అపోహలను దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. సోదరులతో సంగీత బృందంగా ఏర్పడి పాటలు పాడే స్థాయినుంచి, సోలోగా పాటలు పాడే స్థితికి జాక్సన్ ఎదిగిన తీరుని రచయిత చక్కగా విశదీకరించారు. అతని జీవితంలోని తొలిదశలోని భయాలను, ఆందోళనలను హృద్యంగా చిత్రించారు. గాయకుడిగా గుర్తింపు లభించినప్పటినుంచి, సూపర్‌స్టార్‌గా ఎదిగేవరకు విడుదలైన ఆల్బమ్ ల గురించి, వాటిని రూపొందించడంలో జరిగిన కృషి గురించి సవివరంగా తెలిపారు.

థ్రిల్లర్ ఆల్బమ్ ప్రచారం కోసం ఓ ప్రదర్శనలో మైకెల్ జాక్సన్ చేసిన మూన్‌వాక్ అనే నృత్యవిన్యాసాన్ని కళ్ళకి కట్టినట్లు వర్ణించారు. అదే సమయంలో అతని జీవితంలో చుట్టుముట్టిన వివాదాలు, పుకార్లు, వాస్తవాల గురించి చర్చించారు. మైకెల్ జాక్సన్ జీవితంలో విజయాలు, వివాదాలు ఉన్నాయి. మొదట తన మీద తనకి అపనమ్మకం, తోడు కోసం తపించడం, అద్భుతమైన విజయాలు, అహంకారం, పునర్విహాలు, కోర్టు కేసుల్లో ఇరుక్కోడం వంటి పతనోత్థాలు వీటికి నిదర్శనం.

అతను ఎదుర్కున్న అవమానాలు, ఆరోపణలు, క్షీణిస్తున ఆరోగ్యం, క్రుంగదీస్తున్న ఆర్ధిక పరిస్థితులను ప్రస్తావించారు. ఇలా కీర్తి ప్రతిష్టలు దిగజారినప్పుడల్లా మరో కొత్త ఆల్బమ్‌తో ప్రజలని మరిపించిన తీరుని విశ్లేషించారు. చివరగా కోర్టు కేసులలో ఆరోపణలు నిరూపితం కాకపోవడం, మైకెల్ జాక్సన్ నిర్దోషిగా బయటపడం గురించి తెలిపారు.

జీవితంలో దెబ్బతిని, ఓడిపోయి, నిరాశలో మగ్గి, ఆత్మవిశ్వాసంతో తలెత్తి ఉన్నత శిఖరాలకు చేరుకున్న విధానాన్ని ఫీనిక్స్ పక్షి ఉదంతంతో పోల్చారు. ప్రజల గుండెలలో గాయకుడిగా తానింకా బ్రతికున్నానని నిరూపించుకోడం కోసం మైకెల్ జాక్సన్ ప్రపంచవ్యాప్తంగా 50 సభలలో పాడేందుకు అంగీకరించడం, వాటి సన్నాహాలలో సాధన చేస్తూ మరణించడం గురించి రచయిత వివరించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది.

రచయిత మాటల్లోనే చెప్పాలంటే. . . . "‌నల్లవాడిగా సమాజం చూపే వివక్ష, బాల్యంలో అభద్రతా భావం, సెలెబ్రిటీగా మారిన తర్వాత నన్నెవరూ ఏమీ చేయలేరనే ధైర్యం, సూపర్‌స్టార్ అయిన తర్వాత ఎక్కడ తన స్టార్‌డమ్ చేజారిపోతుందనే భయం, దీనికి తోడు విపరీతంగా అందుతున్న ధనం వల్ల కోల్పోయిన బాల్యాన్ని పరోక్షంగా అనుభవించాలన్న తపన, ఆరోపణల వలన చెదిరిన ఆత్మస్థైర్యం, దాన్ని కళ ద్వారా అధిగమించాలన్న ప్రయత్నం, కాని ఎంత ధనం ఉన్నా, ఎంత కళాకారుడైనా, నిరంతరం సాగుతున్న ఎదురుదాడికి లొంగక తప్పదన్న గ్రహింపు, ఫలితంగా ఆత్మవిశ్వాసం కోల్పోడం, కళాకారుడి స్థానంలో ఓ మానసిక రోగి, నిరాశ నిస్పృహలతో మిగలడం.. చివరికి మరణం.." ఇదీ టూకీగా మైకెల్ జాక్సన్ జీవితం.

సెలెబ్రిటీ అవడం, డబ్బు సంపాదించడం కన్నా, భావితరాలకు మనం నేర్పవలసింది జీవితంలో సమతౌల్యం సాధించడం, మానసిక ప్రశాంతతని సాధించడం అనే గుణపాఠాన్ని మైకెల్ జాక్సన్ జీవితం మనకు చెబుతుందని రచయిత అభిప్రాయపడ్డారు. ఈ నిజాన్ని మన సమాజానికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయిత తన ముందు మాటలో చెప్పారు.



పాలపిట్ట బుక్స్ ఆగస్టు 2009
144 పేజీల ఈ పుస్తకం వెల 60 రూపాయలు .
ప్రతులు పాలపిట్ట బుక్స్,
 16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
 హైదరాబాదు - 500036
  palapittabooks@gmail.com  సంప్రదించవచ్చు.

No comments:

Post a Comment