Monday 13 February 2012

ఒబామా – స్ఫూర్తిదాయక విజయగాథ

పాలపిట్ట బుక్స్ ప్రచురించిన ఈ 152 పేజీల పుస్తకం ప్రజాస్వామ్య ప్రస్థానంలో నిలిచి గెలిచిన ఒక సామాన్యుడి సాహసగాథని తెలుపుతుంది. అమెరికా చరిత్రలో ఒక నల్లజాతీయుడు అధ్యక్ష పదవికి పోటీపడడం, గెలవడం ఇదే తొలిసారి. అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా మార్పుకి ఓ చిహ్నం. రాజకీయాలలో, పరిపాలనలో, సకల రంగాలలో మార్పును ఆశించేవారికి స్ఫూర్తి ఒబామా. నవంబరు 4, 2008 ఓ చారిత్రాత్మక దినం. అత్యంత వర్ణవివక్షని చూపిన దేశం ఒబామాని అధ్యక్షుడిగా ఎన్నుకోడం ద్వారా తనని తాను సరిదిద్దుకుంది. బానిసలుగా అమ్మిన గడ్డమీదే నల్లజాతీయుడికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిందమెరికా. ఈ నిశబ్ద విప్లవానికి నాంది పలికిన బరాక్ ఒబామా వెనుక ఘనమైన వారసత్వం లేదు, అతడేమీ పోరాట చరిత్ర ఉన్న నేతా కాదు. మరింత మహత్తర విజయం ఎలా సాధ్యమైంది? దీనికి తోడ్పడిన నేపధ్యమేది? దీనికి మూలాలెక్కడ? ఈ ప్రశ్నలకి ఒబామా జీవితమే సమాధానం.
‘సరైన సమయంలో సరైన వ్యక్తినని ఋజువు చేసుకోడం ద్వారా ఒబామా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అమెరికా చరిత్రలో మార్పుకు వేగుచుక్క అయ్యాడు’ అని అంటారు రచయిత గుడిపాటి. ఇంతటి అద్భుతానికి సూత్రధారి, పాత్రధారి అయిన వ్యక్తి జీవనయానం ఎలాంటిదో తెలియజెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం. ఒబామా అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టిన రెండు నెలల తర్వాత ఈ పుస్తకం విడుదలైంది. దృఢ సంకల్పం, నిజాయితీ, పట్టుదల ఉన్న చోట లక్ష్యసాధన సులువుని తెలిపిన విజయగాథ ఒబామాది.
బరాక్ హుస్సేన్ ఒబామా 4 ఆగస్టు, 1961 నాడు అమెరికాలోని హవాయి రాజధాని హొనొలూలులో పుట్టాడు. ఒబామా తండ్రి బరాక్ ఒబామా సీనియర్ కెన్యా దేశస్తుడు. తల్లి స్టాన్లీ ఆన్‌డన్‌హమ్ శ్వేత జాతీయురాలు. అయితే ఒబామా పుట్టాకా, మూడేళ్ళకి వారిద్దరు విడిపోయారు. 1965లో ఆన్, లోలో అనే ఇండోనేసియన్ విద్యార్ధిని వివాహం చేసుకుంది. ఒబమా తనకు ఆరేళ్ళ వయసులో తల్లితోను, లోలోతోను కలిసి జకార్తాకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సంపన్న దేశమైన అమెరికాలో నగరాలని, ప్రజల జీవనాన్ని చూసిన ఒబామా తొలిసారిగా పేదరికాన్ని దగ్గరగా చూసాడు. ఒబామాని తన కొడుకుగానే మిత్రులకు పరిచయం చేసేవాడు లోలో. అతని చదువులో, ఆటపాటల్లో లోలో భాగస్వామ్యం వహించేవాడు. ధైర్యాన్నిచ్చే మాటలను లోలో చెబితే, నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం గురించి ఆన్ చెప్పింది.
విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ బరాక్, ఆన్‌ల మధ్య శత్రుత్వం లేదు. తను మరో పెళ్ళి చేసుకున్నప్పటికీ, అసలు తండ్రితో కొడుకుకి అనుబంధం ఏర్పడాలని ఆన్ ఆశించింది. అందుకే ఒక పేద దేశంలో పుట్టి మేకల కాపరిగా పెరిగి కష్టపడి చదువుకుని ఎదిగివచ్చిన బరాక్ ఒబామా సీనియర్ గురించి కొడుకు మనసుని ఆకట్టుకునేలా చెప్పింది. మొదట్లో అర్ధం కాకపోయినా, తన తల్లిదండ్రుల వివాహం విఫలమైందని, వారిద్దరు విడిపోయారని క్రమంగా గ్రహించాడు ఒబామా. అమ్మానాన్నల జాతులు, దేశాలు వేరయినప్పటికీ, ఒబామా అమెరికా వాసిగానే పెరిగాడు. ఆఫ్రో-అమెరికన్ సంతతికి చెందిన వాడిగా, నల్ల జాతీయునిగానే పేరొందాడు. తల్లిదండ్రుల విలక్షణమైన కుటుంబ నేపధ్యాలు ఒబామా పెంపకం పైన, వ్యక్తిత్వం పైన ప్రభావం చూపాయి. ఈ నేపధ్యంలోనే దృఢచిత్తం, సంయమనం, పట్టుదలతో పనిచేయడం వంటి లక్షణాలు ఒబామాలో రూపొందాయని అంటారు రచయిత.
హవాయిలో హైస్కూలు చదువు పూర్తి చేసిన ఒబామా ఆ తర్వాత, బి. ఎ చదవడం కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఆక్సిడెంటల్ కాలేజిలో చేరాడు. ఇక్కడ నేర్చుకున్న పాఠాలే ఒబామా జీవన యానంలో అతడి మనోవికాసానికి దారితీసాయి. వ్యక్తిత్వ వికాసానికి పునాది వేసాయి. 1981లో రెండో సంవత్సరం చదువుని న్యూయార్క్‌నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో కొనసాగించాడు. ఇదే విశ్యవిద్వాలయం నుంచి 1983లో రాజనీతిశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు ఒబామా. ఈ క్రమంలో తన జాతి, తన మూలాలకు సంబంధించిన స్పష్టత కలిగిందతనికి.
చదువైపోగానే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది ఒబామాకి. అయితే, తన కలలకు, ఆకాంక్షలకు ఏ మాత్రం పొంతనలేని ఆ ఉద్యోగం చేయలేక, వదిలేసాడు. ఆ తర్వాత పేదవాళ్ళకు సాయపడడం, వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు కృషిచేసే నైబర్‌హుడ్ యాక్టివిస్ట్‌గా షికాగో నగరంలో చేరాడు. ప్రపంచం ఇప్పటికన్నా మెరుగ్గా, ఆశావహంగా ఉండేలా చేయడానికి అవకాశం కల్పించిందా ఉద్యోగం. ప్రపంచంలో తను భరించలేని అన్యాయమైన, ఆమోదయోగ్యం కాని విధానాలను మార్చడానికి కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేయడం ద్వారా తొలి అడుగు వేసాడు ఒబామా. మార్పు దిశగా ప్రయాణించాలన్న అతని కలలు ఆచరణరూపం దాల్చడానకి షికాగో ఒక ప్రయోగశాల అయ్యింది. కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేయడం ద్వారా ప్రజలకు చేరువయ్యాడు, ప్రజల కష్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు తను ముందుండి మాట్లాడక, బాధితులతో మాట్లాడించాడు. ఎవరైతే సమస్యలతో సతమతమవుతున్నారో వారు స్పందించడానికి అవకాశం కల్పించాడు. ఎంతో మందితో కలిసి పనిచేసాడు, అతి సామాన్యులైన వారిలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేసాడు. మనుషులని ప్రోత్సహించడం, ఉత్సాహపరచడం ఒబామాలో ప్రముఖంగా కనపడే లక్షణాలు. ఇవి షికాగో ఉన్న కాలంలో మరింత పదును తేలాయి. ఈ మూడేళ్ళ కాలంలో రాజకీయవేత్తకి ఉండాల్సిన అన్ని నాయకత్వ లక్షణాలను వంటపట్టించుకున్నాడు ఒబామా.
షికాగోలో ఎదురైన సమస్యలు, ‘లా’ చదవాలనే ప్రేరణని ఒబామాలో కలిగించాయి. ఫలితంగా హార్వార్డ్ యూనివర్సిటీలో లా డిగ్రీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నాడు. 1987లో అతనికి సీటు లభించింది. 1991లో చదువు పూర్తయ్యింది. లా స్కూలులో పరస్పర విరుద్ధ భావాలున్న విద్యార్ధుల మధ్య పనిచేయడం ఒబామా అనుభవాన్ని విస్తృతం చేసింది. అధ్యయనం వలన అతని ప్రాపంచిక అవగాహనలో గణనీయమైన మార్పువచ్చింది. నాయకత్వ లక్షణాలు మరింతగా మెరుగు పడ్డాయి.
లా డిగ్రీతో షికాగో తిరిగొచ్చి, సివిల్‌రైట్స్ లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అంతే కాకుండా పార్ట్ టైం అధ్యాపకుడిగా షికాగో యూనివర్సిటీలో లా డిపార్టుమెంటులో రాజ్యాంగ చట్టం బోధించాడు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఒబామాకి 1992లో ఇల్లినాయిలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించింది. ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, ఓటర్లుగా నమోదు కాని లక్షన్నర మంది ఆఫ్రో-అమెరికన్లను ఓటర్లుగా నమోదు చేయించాడు. ఈ కార్యక్రమం విజయవంతమై, ఒబామాకి గుర్తింపుని తెచ్చింది.
చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోడం, తల్లి మరొకరిని పెళ్ళాడడం, తండ్రి బహుభార్యలని చేపట్టడం వంటి అంశాలు ఒబామాని ఆలోజింపజేసాయి. అందుకే బలమైన, అనురాగపూరితమైన వివాహబంధాన్ని ఆశించాడు. ఫలితంగా 1989లో పరిచయమైన మిషెల్ రాబిన్‌సన్‌తో దాదాపు నాలుగేళ్ళ పాటు స్నేహం చేసి 3 అక్టోబరు 1992నాడు వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి 1998లో మొదటి కూతురు మలై, 2001లో రెండో కూతురు నటాషా జన్మించారు. కుటుంబ జీవనంలోని శాంతి, హాయి, తేలికపడిన మనస్తత్వం సామాజిక రాజకీయ జీవితంలో ఒబామా ఉన్నతికి తోడ్పడ్డాయి. న్యాయవాదిగా కన్నా, రాజకీయాల్లోకి ప్రవేశిస్తేనే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతానని అనుకున్నాడు ఒబామా. పనులు జరగాలంటే నిర్ణయాధికారం ఉండాలని, నిర్ణయాత్మక శక్తిగా నిలవాలని, విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం వహించాలని గ్రహించాడు. ఈ క్రమంలో 1995లో ఇల్లినోయి రాష్ట్ర సెనెటర్‌గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ ఎన్నికల ప్రచార క్రమంలో మొదటిసారిగా తన అభిప్రాయాలని, విశ్వాసాలని షికాగోలో, ఇల్లినోయిలో ఉన్న ప్రజలకి తెలియజేసే అవకాశం అతనికి లభించింది. ‘మార్పు’ అనే మాట ఆనాటి నుంచి అతనినోట వినిపించడం ఆరంభమైంది. భిన్న ధృవాలుగా ఉన్న వారి మధ్య విభేదాలను పరిష్కరించి, కలిసిపనిచేయడానికి ఒప్పించిన తీరు ఒబామాకి మంచి ప్రచారం తెచ్చిపెట్టింది. అతని గెలుపు సులభమైంది. స్టేట్ సెనెటర్‌గా ఎన్నికయ్యాడు. మొదటి దఫా సెనెటర్‌గా వ్యహరించిన కాలంలో ఎన్నో శాసనాలు అమలయ్యేలా చేయడంలో ఒబామా కృషి ఫలించింది. 1998లో రెండో సారి సెనెట్‌కి పోటీ చేసి గెలిచాడు. 2002లోను గెలిచాడు. మొత్తం మూడుసార్లు పోటీచేసి ఎనిమిదేళ్ళపాటు స్టేట్ సెనెటర్‌గా పనిచేసాడు. అయితే, ఒబామా రాజకీయ జీవితంలో విజయాలే కాదు, పరాజయాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా ప్రతినిధుల సభకి పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఈ ఓటమి అతనిని కుంగదీయలేదు, పైగా ఎన్నో పాఠాలు నేర్పింది. ఆత్మవిమర్శ చేసుకోడం, పొరపాట్లు ఉంటే ఒప్పుకోడం, సహచరుల అభిప్రాయాలని మన్నించడం, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయాలు ప్రకటించడం అనే పద్దతులు ఒబామాను విలక్షణమైన రాజకీయవేత్తగా నిలిపాయి.
2004లో అమెరికా సెనెట్‌కి పోటీచేసాడు. భారీ ఎత్తున ప్రచారం చేయడానికి అవసరమైన నిధులు లేకపోడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు ఒబామా. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్ళడం, చిన్న చిన్న సమావేశాలు, సభలు జరిపి ఓటర్లకు సన్నిహితుడయ్యాడు. ‘మనం సాధించగలం, ఆచరించి చూపగలం’ అనే ఒబామా మాటలు ఓటర్లను మంత్రముగ్ధులని చేసాయి. ప్రచారం చివరి మూడు వారాల్లో ‘యస్, వుయ్ కెన్ ‘ అనే నినాదాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. 2004 నవంబరు 4 న పోలింగ్ జరిగింది. 72% ఓట్లను సాధించి విజయం సాధించాడు ఒబామా. 2005 జనవరి 4న అమెరికా సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసాడు. సెనెట్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన ఒబామా అనేక సెనెట్ కమిటీలలో సభ్యుడిగా వ్యవహరించాడు. కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదం పొందేడట్లు చొరవ చూపాడు. సెనెటర్ అయ్యాక విస్తృతి చెందిన కార్యరంగం ఒబామాని మరింతగా జనాలలోకి తీసుకెళ్ళింది. పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. తన ఆలోచనల వైశాల్యాన్ని పెంచడానికి అతను రచనలు చేసాడు. డ్రీమ్స్ ఫ్రం మై ఫాదర్, ది అడాసిటీ ఆఫ్ హోప్ అనే రెండు పుస్తకాలు అతని రచనా వ్యాసాంగానికి ప్రాసంగికతని తెచ్చిపెట్టాయి.
సెనెటర్‌గా మొదటి రెండేళ్ళ కాలంలో అతని పనితీరు, అతని మాటల ధోరణి, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసే పద్దతి జనాలని మెప్పించాయి. ఆఫ్రికన్-అమెరికన్ అవడం, అంకితభావంతో పనిచేస్తూ పదుగురి దృష్టిలో పడిన క్రమం ఒబామాకి కొత్త రహదారిని నిర్దేశించింది. ఆఫ్రికా పర్యటన తర్వాత ఆలోచనలో స్పష్టత వచ్చింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు 10 ఫిబ్రవరి 2007నాడు ప్రకటించాడు. అయితే అతని మార్గం కఠినమైనది, సవాళ్ళతో నిండినది. డెమోక్రటిక్ పార్టీ తరపునుంచి అధ్యక్షపదవికోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడాల్సివచ్చింది. దాదాపు 17 నెలల పాటు హిల్లరీ, ఒబామాల మధ్య పోరు నడిచింది. ప్రైమరీ దశలో పలు అంశాలు చర్చకి వచ్చినా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వాన్ని ఒబామా సాధించుకున్నాడు. 2008 ఆగస్టులో ఒబామా అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు డెమోక్రాట్లు. ఇక్కడి నుంచి అసలు సమరం మొదలైంది.
రిపబ్లికన్ పార్టీ తరపున జాన్‌మెక్‌కెయిన్ అభ్యర్ధిత్వాన్ని 2008 మార్చిలో ప్రకటించారు. ఒబామా, మెక్‌కెయిన్‌ల మధ్య జరిగిన డిబేట్లలో ఒబామా ప్రదర్శించిన స్పష్షమైన వైఖరి ప్రజలలో అతని పట్ల మన్నన పెంచింది, అత్యంత ఆదరణని కల్గించింది. సంక్షోభ కాలంలో దేశాన్ని గట్టెక్కించగలిగే అనుభవం తనకు ఉందని, మెక్‌కెయిన్ గట్టిగా ప్రచారం చేసాడు. ఒబామా మాత్రం వాషింగ్టన్‌లో ‘మార్పు’ అవసరమన్న అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఆర్ధిక వ్యవస్థ పతనమైన కొద్దీ మెక్‌కెయిన్ ఆదరణ తగ్గింది, ఒబామా విజయావకాశాలు పెరిగాయి. తన ప్రసంగాలలో మార్పు గురించి మాట్లాడుతూ, మనం సాధించగలం అని పదేపదే చెబుతూ ఆశలు రేకిత్తాంచాడు ఒబామా. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమై, జీవితం దుర్భరంగా మారుతున్నప్పుడు భవిష్యత్తు పట్ల ఆశని ప్రకటించడం, మార్పు సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం బాగా పనిచేసింది. ఫలితమే – ఒక సామాన్యుడైన నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికవడం. అధ్యక్ష పదవికి ఒబామాకన్నా ముందు ఎన్నికైన 43 మంది తెల్లవాళ్ళే. 44 వ అధ్యక్షుడిగా ఆఫ్రో-అమెరికన్ అయిన ఒబామాని ఎన్నుకోడం నేటి అమెరికన్ల విజ్ఞతకి, సంస్కారానికి, చైతన్యానికి ప్రతీక.
అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2009నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థని చక్కదిద్దే కార్యక్రమంతో మార్పుకి నాంది పలికాడు ఒబామా. ఈ విధంగా ఒబామా బాల్యం నుంచి, అధ్యక్ష పదవి చేపట్టేదాక అతని జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను ప్రస్తావిస్తూ అతని జీవితంలోని పలుపార్శ్వాలను పరిచయం చేస్తుందీ పుస్తకం. అలాగే అధ్యక్షుడయ్యాక, ఒబామా చేయాల్సిన పనులను, అతనినుంచి ఆశించే మార్పులను ప్రకటించిందీ పుస్తకం. అతని విజయాన్ని మనం ఏవిధంగా చూడాలో చెబుతుందీ పుస్తకం.
ఏప్రిల్ 2009లో ప్రచురించిన ఈ పుస్తకం వెల 55 రూపాయలు .
 ప్రతులు పాలపిట్ట బుక్స్,
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
 హైదరాబాదు – 500036
అనే చిరునామాలో లభ్యమవుతాయి.
ప్రచురణకర్తలను
palapittabooks@gmail.com అనే ఈ-మెయిల్‌లో సంప్రదించవచ్చు.

No comments:

Post a Comment