Monday 13 February 2012

ఆమె ఎవరైతే మాత్రం – శివారెడ్డి కవిత్వ సంకలనం

మోహనా! ఓ మోహనా!’ కవితా సంపుటికి 1990లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునందుకున్న కవి కె. శివారెడ్డి వెలువరించిన కొత్త కవిత్వ సంకలనం ‘ఆమె ఎవరైతే మాత్రం’.
‘సాహసంతో జీవితాన్ని తమ ఇష్టమొచ్చినట్టు
మలచుకొనేవాళ్లకు జై
ప్రపంచానికి ముగుదాడేసి తమ వెంట
నడిపించుకుపోతున్న స్త్రీమూర్తులందరికీ జై ‘
అంటూ ఆయన స్త్రీలందరికీ అంకితమిచ్చిన ఈ కవితల పుస్తకాన్ని కిందటివారమే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. అంతకుముందు రోజు కవి వీటిని చదివి వినిపించిన కార్యక్రమం కూడా జరిగింది. సమాచారం తెలిసినా పని భారంలో రెండుసార్లూ వెళ్లలేకపోయానుగానీ, పుస్తకం చేతికొచ్చిన తర్వాత చదవకుండా మాత్రం ఉండలేకపోయాను.
‘సగటు మగాడిలా ఎక్కడా స్త్రీని తప్పు పట్టకుండా, న్యూనపరచకుండా, ఆమె ప్రతి కదలికకూ, ప్రతి ఆలోచనకూ, ఆచరణకూ కారణాలను వ్యవస్థలో వెతుక్కుంటూ ‘ఆమె’ను అపార సానుభూతితో, ప్రేమతో, కరుణతో ఆశ్లేషించుకోవడం ఈ కవితలలోని ప్రత్యేకత’ అంటూ ప్రచురణకర్తలు పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి చెబుతున్నారు.
అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిని పోగొట్టుకున్న కవి శివారెడ్డిని అతని నాయనమ్మ పెంచారు. చిన్నతనంలో ఆయనపై చెరగని ముద్ర వేసిన శ్రమసౌందర్య ప్రతినిధులు మాలకొండమ్మ, శకుంతలమ్మతో పాటు జీవితం ప్రతి అడుగులోనూ తారసపడిన స్త్రీలలో ఏదోక విలక్షణతను చూసిన కవి కలం ఈ తరహా కవితలు రాయడం సహజమే. ‘అయిదేళ్ల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న ఒక పల్లెటూరి బాలుడికి ప్రపంచం ఒక వేయి తలల నాగుపాము. జీవితం ఒక భయం, ఒక దరిద్రం, ఒక అనాదరణ. అనాథబాల్యాలు కానీ, ఆర్ద్రత లోపించిన పిలుపులుగానీ, ఏకాకితనాలు కానీ, అర్థం కాని సంబంధాలు కానీ, అన్నీ అన్నీ భయంభయంగా నాలో మిగిలి నా అంతర్లోకాలన్నింటినీ ముట్టించి ఊదరబెట్టి ఊపిరాడక అరిస్తే, అమ్మా! అంటే పలికే గొంతు లేనప్పుడు – బహుశా ఇవన్నీ నా కవిత్వంలో అదృశ్యంగా నర్తిస్తూ ఉంటాయేమో’ అని చెబుతారు శివారెడ్డి. ఆ అనుభూతి నిజాయితీగా వ్యక్తమవుతుంది ఈ పుస్తకంలో. కవిత్వమంటే ఇష్టం, స్త్రీత్వం పట్ల ప్రేమ ఉన్నవారందరూ చదవాల్సిన పుస్తకం ‘ఆమె ఎవరైతే మాత్రం’
దాన్నుంచి మచ్చుకో కవిత :
ఆమెకలదు
ఏం చేస్తావు ఆమెని
ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
నీ రెండు కళ్లను పీకి
ఆమె అరచేతుల్లో పెట్టగలవా
ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
ఏం చేస్తావు ఆమెని
నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
గుండెలో విరిగిన ముల్లును
మునిపంటితో బయటికి లాగగలవా
భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
విశ్వమంతా ఊరేగించగలవా
ఏం చేయగలవు నువ్వు
చెదిరిన ముఖంగలవాడివి
చీలిన నాలుకలవాడివి
తలాతోకా తెలియని
మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
ఛేదించగలవా చదవగలవా
చిరుమువ్వల పువ్వులు ధరించి
తిరుగుతున్న ఆమెను వినగలవా
వీనులతో చూడగలవా
ఆమెనేం చేయగలవు
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
అందుకోగలవా అనువదించగలవా
ఆరుబయట వెన్నెట్లో
అమోఘంగా చలించే ఆమెను
తాకగలవా, తాకి తరించగలవా -
ఆమె ముందొక శిశువై
దిగంబరంగా నర్తించగలవా
ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
ఏం చేయగలవు
ఏం చేయలేని వెర్రిబాగులాడా
వెదకటం తెలియాలిరా
మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
ఆమె రక్షించగలదు
ఆమె కలదు, నువ్వు లేవు.
(22 ఫిబ్రవరి 2009 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

152 పేజీలున్న ఈ పుస్తకం వెల 50 రూపాయలు.
రచురణకర్తల చిరునామా :
పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ
సలీం నగర్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌ -036
ఈమెయిల్‌ palapittabooks@gmail.com

No comments:

Post a Comment